MLC Kavita | డెడ్‌కేషన్ కమిషన్‌కు త్వరలో జాగ్రుతి నివేదిక
MLC Kavita | డెడ్‌కేషన్ కమిషన్‌కు త్వరలో జాగ్రుతి నివేదిక
బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి
రాజకీయ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే
తెలంగాణ జాగ్రుతి సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
బీసీ కులగణనల అంశాలపై పలు కీలక నిర్ణయాలపై చర్చ
Hyderabad : రాష్ట్రంలో కుల గణన సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది. తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివేదికను అందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం తన నివాసంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి అధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించిన సంగతి విదితమే. ఆ సమావేశాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. వాటిని క్రోడీకరించి తెలంగాణ జాగృతి నివేదికను రూపొందించింది.
జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించింది. తెలంగాణ సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించే విధంగా పకడ్బందీగా నివేదికను రూపొందించారు. ఈ నివేదిక రూపకల్పనతో బీసీ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, పలువురు మేధావుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో నివేదిక సమర్పించడం గమనార్హం. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సమ ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను మరింత పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను నామమాత్రంగా కాకుండా ..పకడ్బందీగా నిర్వహించి, ఈమేరకు రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అలాగే గత 17 సంవత్సరాలుగా అనేక అంశాల్లో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా క్రీయాశీకలంగా వ్యవహరించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి అవిశ్రాంతంగా పోరాటం చేసిందని స్పష్టం చేశారు.
* * *
Leave A Comment